User:CKoerner (WMF)/Support for our communities across India/te

This page is a translated version of the page User:CKoerner (WMF)/Support for our communities across India and the translation is 100% complete.

Please help translate to your language

భారత దేశం లోని మా సముదాయాలకు తోడ్పాటు

అందరికీ నమస్కారం,

వికీపీడియా ప్రాజెక్టులకు బలం - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వదాన్యులైన స్వచ్ఛంద సేవకులు, సమూహాలు, సంస్థల నెట్‌వర్కు అయిన మీరే. మీరంతా కలిసి, వికీపీడియా ప్రాజెక్టులను, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.

వికీమీడియా ఇండియా గుర్తింపును రద్దు చేయాలని అఫిలియేషన్స్ కమిటీ సిఫారసు చేసిన సంగతి మీరు వినే ఉంటారు. దీని వలన భారత్‌లో వికీమీడియా సమూహాల భవిష్యత్తు ఏమౌతుందని కొందరు సముదాయ సభ్యులు అడిగారు. అఫిలియేషన్స్ కమిటీ నిర్ణయం గురించి మరికొంత సమాచారాన్ని మీకు ఇద్దామని, భారత్ లోని సముదాయాలకు దన్నుగా నిలవడంలో మా నిబద్ధతను మళ్ళీ చాటాలని మేం భావిస్తున్నాం.

వికీపీడియా అనుబంధ సంస్థలకు ప్రతినిధిగా ఉంటూ వాళ్లకు సహాయకంగా ఉండే అఫిలియేషన్స్ కమిటీని స్వచ్ఛంద సేవకులు నడిపిస్తూంటారు. కొన్ని సంవత్సరాల పాటు వికీమీడియా ఇండియా కార్యకలాపాలను చాప్టర్ అవసరాలకు అనుగుణంగా మలచేందుకు కృషి చేసిన తరువాత, దానితో ఉన్న ఒప్పందాన్ని పొడిగించవద్దని 2019 జూన్‌లో కమిటీ సిఫారసు చేసింది.

2011 లో మొదటిగా వికీమీడియా ఇండియా ఒక చాప్టరుగా గుర్తింపు పొందింది. 2015 లో చాప్టరు ఒప్పందంలోని నిబంధనలను అమలు చెయ్యడంలో అది ఇబ్బందులు ఎదుర్కొంది. అఫిలియేషన్స్ కమిటీతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించుకొని, పనిచేసి 2017 నాటికి తిరిగి గాడిలో పడింది. అయితే, మళ్ళీ 2017, 2019 మధ్య కాలంలో లాభాపేక్ష లేని సంస్థగా పని చేసేందుకు చాప్టరు ప్రభుత్వం నుండి లైసెన్సు తెచ్చుకోలేక పోయింది. ఫౌండేషన్ నుండి నిధులు పొందేందుకు వీలుగా దానికి చట్టబద్ధమైన ధార్మిక సంస్థగా కూడా రిజిస్ట్రేషను లేదిప్పుడు. ఈ లైసెన్సు, రిజిస్ట్రేషను రెండూ పొందగలిగేవే నని ఫౌండేషన్, అఫిలియేషన్స్ కమిటీ రెండూ భావిస్తున్నాయి. గుర్తింపు పొందేందుకు అవసరమైన చర్యలను చాప్టరు తీసుకుంటుందని కూడా అవి భావిస్తున్నాయి.

మా ప్రపంచవ్యాప్త ఉద్యమంలో తమదైన ముద్ర వేస్తూ, గొప్ప నాయకత్వాన్ని అందిస్తున్న భారత సముదాయం పట్ల మాకు కృతజ్ఞతా భావం ఉంది. ప్రస్తుతం 8 భారతీయ భాషల్లోని సముదాయాలకు ఫౌండేషన్ మద్దతు నిస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో కొత్తగా మరో రెంటిని అఫిలియేషన్స్ కమిటీ ప్రకటించబోతోంది. భారత్ పాఠకుల నుండి నెలకు మాకు 70 కోట్ల పైచిలుకు పేజీవ్యూలు వస్తాయి. భారత సముదాయం అభివృద్ధి చెందడం వికీపీడియా భవిష్యత్తుకు, వికీమీడియా ప్రాజెక్టుల భవిష్యత్తుకూ చాలా ప్రధానం.

వికీపీడియా ఉద్యమానికి భారత గణతంత్ర రాజ్యం ఎంతో ముఖ్యమైనది. భారత్‌లో స్వచ్ఛందంగా పని చేస్తున్న ఎడిటర్లు, సమర్పకులు, పాఠకులు, దాతల పట్ల మా నిబద్ధత కొనసాగుతూనే ఉంటుంది. వికీమీడియా ప్రాజెక్టులు, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో మీరు చేస్తున్న కృషి పట్ల మేము కృతజ్ఞులమై ఉంటాం. మీతో కలిసి చేసే కృషిని కొనసాగించేందుకు మేం ఎదురు చూస్తున్నాం.

వికీమీడియా ఫౌండేషన్ తరఫున,

వాలెరీ డి కోస్టా
ఛీఫ్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్
వికీమీడియా ఫౌండేషన్